ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి చెప్పాల్సి వస్తే.. ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది.. వైసీపీ అధినేత జగన్ కోసం ఆయన చేసిన త్యాగాలే. ఆ తర్వాత.. పార్టీలో వచ్చే సమస్య లను పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవ. ఈ రెండు కూడా ప్రకాశం జిల్లా వైసీపీని ముందుకు నడిపించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 2012లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు మంత్రిగా ఉన్న బాలినేని.. వైసీపీ స్థాపనతో ఆ పదవిని తృణప్రాయంగా త్యజించి జగన్ కోసం వైసీపీ జెండాను భుజాన వేసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో బలమైన టీడీపీ వర్గాన్ని ఆకర్షించి.. వైసీపీని బలోపేతం చేశారు. అంతేకాదు.. 2012 ఉప ఎన్నికలో వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కారు. 2014లో ఓడిపోయిన జిల్లాలో కొన్ని సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఆ తర్వాత ఆయన ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కుగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరు స్వతంత్రంగా పోటీ చేసినా.. వారిని మచ్చిక చేసుకుని.. జిల్లాలో వైసీపీ పునాదులు బలంగా ఉండేలా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి దక్కేలా వ్యవహరించారు.
ఇక, పార్టీపరంగానే కాకుండా.. రాజకీయంగా కూడా టీడీపీ నేత వాయిస్‌ని తగిలించి.. వైసీపీ దూకుడు పెంచడంలోనూ అనేక సమస్యలు ఎదుర్కొన్నా.. ముందుకు సాగారు. ప్రకాశం అంటే.. బాలినేని.. బాలినేని అంటే ప్రకాశం అన్నతరహాలో ఆయన దూకుడు ప్రదర్శించారు. అలాంటి నాయకుడు.. ఇప్పుడు వైసీపీలో ఒంటరి అయిపోయారనే వాదన బలంగా వినిపిస్తోంది. గత ఏడాదిన్నరగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. బాలినేని తమకు అవసరం లేదనే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందనే టాక్ ఆయన వర్గం నుంచి బలంగానే వినిపిస్తోంది.
మరి వైసీపీ కోసం బాలినేని చేసిన త్యాగాలు.. షార్ప్ షూటర్‌గా ఆయన ప్రదర్శించిన దూకుడును పార్టీ మరిచిపోయిందా? అనేది ప్రశ్న. అంతేకాదు..ఇప్పుడు ఎవరినైతే.. వైసీపీ చేరదీసి పదవులు ఇచ్చిందో వారి మాటను వినే పరిస్థితి జిల్లాలో లేదు. అయినా.. కూడా బాలినేనికి ప్రాధాన్యత తగ్గిపోవటం గ’మనార్హం. మరోవైపు ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తున్న టీడీపీ బాలినేని తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు సమాచారం. వైసీపీలో బాలినేని ఉంటాడా అన్నదే ఇప్పుడు ప్రకాశం రాజకీయాల్లో సస్పెన్స్‌గా మారింది.