జ‌గ‌న్ న‌మ్మాడు.. అవినాష్ చేసి చూపిస్తున్నాడు….!

వైసీపీలో పార్టీ అధినేత జ‌గ‌న్ ఏదైతే.. కోరుకున్నారో.. అదే చేస్తున్న నాయ‌కులు చాలా త‌క్కువ మంది ఉన్నారు. ఇలాంటి వారిలో తొలి వ‌రుస‌లో నిలుస్తున్నారు విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన యువ నాయ‌కుడు దేవినేని అవినాష్‌. నియోజ‌క‌వ‌ర్గంలో దూకుడు ఓ రేంజ్‌లో ఉంద‌నే టాక్ వినిపిస్తుండడం గ‌మ‌నార్హం. టీడీపీలో ఆశించిన గుర్తింపు లేక‌పోవ‌డంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో ఉండ‌గా.. గుడివాడ టికెట్ ఇచ్చారు. వాస్త‌వానికి ఆయ‌న కోరుకున్న‌ది విజ‌య‌వాడ తూర్పు. కానీ, చంద్ర‌బాబు అవినాష్‌కు సంబంధం లేని నియోజ‌క‌వ‌ర్గాన్ని కేటాయించారు.

 

అది కూడా ఎన్నిక‌ల‌కు నెల రోజుల ముందే సీటు ఇవ్వ‌గా… అవినాష్ గుడివాడ వెళ్లి అక్క‌డ గ్రూపుల‌ను క‌ల‌ప‌డానికే నానా తంటాలు ప‌డాల్సి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో అవినాష్‌కు టీడీపీలోనూ స్వ‌తంత్రం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న‌కు తెలుగు యువ‌త రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని కూడా నాన్చి నాన్చి ఇచ్చార‌ని, నిర్ణ‌యాలు తీసుకునే విష‌యంలోనూ ఆయ‌న‌కు స్వ‌తంత్రం లేకుండా పోయింద‌న్న‌ది ఓపెన్ సీక్రెట్‌? అవినాష్ ఎన్నిక‌ల్లో ఓడినా తెలుగు యువ‌త అధ్య‌క్షుడి హోదాల ఎక్క‌డైనా ప‌ర్య‌టిస్తే దానిపై కొర్రీలు, కంప్లెంట్లు… లోకేష్‌ను డామినేట్‌ చేస్తున్నాడ‌ని కొంద‌రి గుస‌గుస‌లు బ‌య‌టకు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో తీవ్ర మ‌న‌స్థాపానికి గురై.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అవినాష్‌. ఇక‌, జ‌గ‌న్ కూడా దూకుడు ఉన్న నాయ‌కుల‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే అవినాష్‌కు ఫ్రీడం ఇచ్చారు. ఈ ప‌రిణామాన్ని అవినాష్ చ‌క్క‌గా వినియోగించుకున్నారు.  త‌క్కువ టైంలోనే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే అవినాష్ విజ‌య‌వాడ నగ‌ర రాజ‌కీయాల్లో త‌న ముద్ర వేయ‌డంతో పాటు అటు వైసీపీలోనూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువ‌నేత‌గా ఎదిగారు. అవినాష్ టీడీపీలో ఉంటే సంవ‌త్స‌రాలు పోరాటాలు చేసి క‌ష్ట‌ప‌డినా ఇంత క్రేజ్ వ‌చ్చేది కాదేమో..!

 

అవినాష్ విజయ‌వాడ‌లో నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటూ త‌న తండ్రి నెహ్రూలా బ‌ల‌మైన మాస్ లీడ‌ర్‌గా ఎదుగుతున్నాడు. న‌గ‌ర వైసీపీ అధ్య‌క్షుడు బొప్ప‌న భ‌వ‌కుమార్ తో పాటు కీల‌క నేత‌ల‌ను… అన్ని సామాజిక వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోతున్నాడు. ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గాన్ని కూడా క‌లుపుకొని పోతూ.. రాజ‌కీయంగా వారిని వైసీపీ వైపు చేరువ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అధికారుల బ‌దిలీల విష‌యంలోను, నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌లు, ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డంలోను దేవినేని అవినాష్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు.

నిజానికి విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో గ‌త ద‌శాబ్దాల కాలంగా చూస్తే చాలా మంది నాయ‌కులు సాధార‌ణంగా ప‌క్క నియోక‌వ‌ర్గాల్లో వేలు పెడుతుంటారు. కానీ, అవినాష్ మాత్రం త‌న‌కు అప్ప‌గించిన నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనేత‌న స‌త్తా చాటుతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే చాలా మంది ఎమ్మెల్యేల‌కు సీఎం అపాయింట్‌మెంట్ దొర‌క‌డ‌మే గ‌గ‌నంగా ఉంది. అలాంటిది అవినాష్ ఎప్పుడు అపాయింట్‌మెంట్ అడిగినా ఇవ్వ‌డంతో పాటు తూర్పు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నాడు జ‌గ‌న్‌.