ప్రతి రంగంలో విజన్ ఉండాలని, అరకొర ఆలోచనలు వద్దని పశుసంవర్థక, మత్స్యశాఖ సమీక్షా సమావేశంలో అధికారులతో సీఎం జగన్ అన్నారు. దార్శనికతతోనే సమూల పరిష్కారాలు లభిస్తాయన్న ఆయన పెద్ద ఆలోచనలతోనే మార్పులు వస్తాయని అన్నారు. ఆర్బీకేల ఏర్పాటు, స్కూళ్లలో నాడు – నేడు, ప్రజారోగ్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న ఆయన పాదయాత్రలో నా కళ్లతో చూసిన పరిస్థితులను మార్చాలని ప్రయత్నిస్తున్నానని అన్నారు. అలానే దేవుడు, ప్రజలు ఆశీర్వదించి ఈ సీటులో కూర్చోబెట్టారని, అందరికీ మంచి చేయాలని తపిస్తూ, అంకిత భావంతో ముందడుగులు వేస్తున్నామని అన్నారు.
ఇక ఈ సమీక్షా సమావేశంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఫిషరీస్ కమిషనర్ కన్నబాబుతో సహా, ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. చేపలు, రొయ్యలు పండిస్తున్న రైతులకు కనీస గిట్టుబాటు ధరలు రావాలని, రైతులకు మంచి ధరలు వచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం వ్యూహాత్మక విధానాన్ని అనుసరించాలని అన్నారు. ఆక్వా ఉత్పత్తుల కోసం ప్రీ ప్రాసెసింగ్, ఐక్యూఎష్, కోల్డు స్టోరేజీల సదుపాయాలు కల్పించి వాటిని జనతా బజార్లకు అనుసంధానం చేయాలని, దాని వల్ల ఆక్వా రైతులకు రైతులకు భరోసా ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. ప్రై వేటు వ్యక్తులు సిండికేట్ కాకుండా రైతులకు భరోసాను ఇవ్వగలుగుతామని ఆయన పేర్కొన్నారు.