జగన్ పక్కా ప్లాన్ తో చేశారో.. లేక బాబు వచ్చి అలా పడ్డారో తెలియదు కానీ… విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో బాబు రాజకీయ జీవితానికి పెద్ద దెబ్బ తగిలిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు! అమరావతిని వదులుకోలేకా, విశాఖను వద్దనలేక బాబు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు! కాకపోతే బాబు మనసంతా అమరవతి పైనా.. ఆ 20 జిల్లాలపైనే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు! మహానాడు వేదికగా అమరావతి విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని, రాజధాని రైతులకు తోడుగా ఉంటానని ప్రకటించారు!
ఈ క్రమంలో బాబును 13 జిల్లాలకు ప్రతిపక్ష నేతగా కాకుండా అమరావతిలోని 20 గ్రామలకు మాత్రమే నాయకుడిగా చేశారా అన్న అనుమానం వ్యక్తపరుస్తున్నారు బాబు అభిమానులు. జగన్ పక్కా స్కెచ్ లో భాగమో ఏమో కానీ.. బాబు కూడా అలానే ప్రవర్తిస్తూ, జగన్ కు సహకరిస్తున్నారు! అవును… సుమారు రెండు నెలల తర్వాత రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబు మహానాడు కార్యక్రమాన్ని మాత్రం నిర్వహించుకుని.. అమరావతి రైతు నాయకులు కొందరితో మాట్లాడుకుని… తనకు ఇంకేమీ బాధ్యతలు లేవన్నట్లుగా వెంటనే హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లిపోయారు! అదేంటి… విశాఖకు వెళ్తానని కదా ఏపీ డీజీపీ దగ్గర బాబు అనుమతి తీసుకుంది? అక్కడకు వెళ్తానని అనుమతి తీసుకుని, అమరావతికి మాత్రం వచ్చి, తిరిగి హైదరాబాద్ కి వెళ్లిపోవడం ఏమిటి? అని అభిమానులు తెగ ఫీలయిపోతున్నారట!
విశాఖ బాధితుల కుటుంబాలను పరామర్శించే విషయంలో ఇప్పటికే జీవితకాలానికి సరిపడా ఆలస్యం చేసిన బాబు.. ఆ ఆలస్యాన్ని కరోనాకు కట్టబెట్టేశారు. సరే జరిగిందేదో జరిగింది… పెద్దాయన కదా కరోనాకు భయపడి ఉంటారు అని సరిపెట్టుకున్న విశాఖ వాసులకు మళ్లీ షాకిచ్చారు బాబు! మహానాడు పూర్తయిన వెంటనే విశాఖకు వస్తారని గంటా శ్రీనివాస రావు ప్రకటించారు కూడా! అయినా ఇంతలోనే ఏమి జరిగిందో ఏమో! కనీసం మహానాడు వేదికగా బాబు కోటి రూపాయల పరిహారానికి ధీటుగా ప్రకటించిన ఆ రూ. 50వేల చెక్కులను పంచే కారణంతో అయినా బాబు విశాఖకు వెళ్లి ఉండాల్సింది. కానీ.. అమరావతి నుంచి విశాఖకు వెళ్లకుండా నేరుగా హైదరాబాద్ కే వెళ్లిపోయారు.
దీంతో వైకాపా నాయకులు మైకులందుకున్నారు! బాబు విశాఖ వస్తామని చెప్పి ఈ వైపు ముఖం చూపించకుండానే తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవడం పట్ల వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ మండిపడ్డారు. బాధితుల పట్ల బాబు చిత్తశుధ్ధికి ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి ప్రమాదం జరిగిన వెంటనే ఎవరైనా పరామర్శకు వస్తారు కానీ.. తాపీగా మూడు వారాల తరువాత ఆంధ్రాకు వచ్చిన బాబు విశాఖ వస్తానని చెప్పి మరీ మాట తప్పారని ఫైర్ అయ్యారు. బాబు వచ్చినా రాకపోయినా ఏమీ జరగదని, బాధితులకు ఒరిగేది ఏమీ లేదని గ్రహించిన బాబు… హైదరాబాద్ వెళ్లిపోయారని విమర్శించారు! దీంతో… 13 జిల్లాలా కంటే ఆ 20 జిల్లాలకే బాబు నాయకుడిగా మిగిలిపోయారని… 13 జిల్లాలు వద్దు ఆ 20 గ్రామాలే ముద్దు అనేస్థాయికి బాబుని తీసుకురావడంలో జగన్ సక్సెస్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి!