నేడు కుప్పంలో సీఎం జగన్ పర్యటన..రూ. 66 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్తత కు దారి తీసిన సంగతి తెలిసిందే. అన్న క్యాంటీన్ ప్రారంభం నేపథ్యంలో వైఎస్ఆర్సిపి, టిడిపి మధ్య కొట్లాటతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన ఆసక్తికరంగా మారింది.

ఇవాళ ఆయన కుప్పం రానున్నారు. ఈ సందర్భంగా కుప్పం మున్సిపాలిటీలో రూ. 66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అలాగే కుప్పంలో ఇవాళ వర్చువల్‌‌గా మహిళల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 26,39,703 మంది మహిళలకు లబ్ది.. చేకూరనుంది. అలాగే రూ. 4,949.44 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించనున్నారు ముఖ్యమంత్రి జగన్.