పెనమలూరు నియోజకవర్గంలోని పునాదిపాడులో విద్యా కానుకను ప్రారంభించిన సిఎం జగన్ అనంతరం నాడు-నేడు కింద అభివృద్ధి చేసిన పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఆ తరువాత తరగతి గదిలో కూర్చున్న విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ నోబెల్ బహుమతి పొందిన మలాలా యూసెఫ్ జాయ్ మాటలు నాకు గుర్తు వస్తున్నాయని, నెల్సెన్ మండేలా కూడా విద్యతోనే ప్రపంచాన్ని మార్చవచ్చు అని చెప్పారని అన్నారు. ప్రపంచంతో పోటీ పడి, జయించే శక్తి మన పేద పిల్లల్లో రావాలన్న అయన ఇది జరగాలనే ఉద్దేశంతో మేము విద్యా వ్యవస్థ లో మార్పులు తెచ్చామని అన్నారు. చదువే తరగని ఆస్తి, ఎవరూ ఎత్తుకుపోలేని ఆస్తి అని ఆయన అన్నారు.
చదువే మన బ్రతుకులను మార్చే ఆస్తి కాబట్టే మేము ముందుకు అడుగులు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం పాఠశాలలు ను అభివృద్ధి చేసేందుకే నాడు..నేడు అమలు చేస్తున్నామన్న ఆయన నవంబర్ రెండు నుంచి బడులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అన్నారు. కోవిడ్ కారణంగా మూడు రోజుల పాటు ఈ కిట్ ల పంపిణీ చేస్తున్నామని, ఈ మార్పు తో.. జగన్ మామ ప్రభుత్వం లో బాగా చదువుకుంటాం అని పేదలు గొప్ప గా చెప్పాలని అన్నారు. పిల్లలను బడికి , కాలేజీకి పంపాలలనే అమ్మ ఒడి కింద యేటా 15వేలు ఇస్తున్నామని, జనవరి తొమ్మిదిన మళ్లీ రెండో విడత 15వేలు ఎకౌంటు లో వేస్తామని అన్నారు. బడికి వచ్చే ప్రతి పిల్లవాడికి గోరు ముద్ద కింద రోజుకో రకమైన వంటకంతో భోజనం పెడుతున్నామని మాది మనసున్న ప్రభుత్వం కాబట్టే… పుట్టిన బిడ్డ దగ్గర నుంచి విద్య పూర్తి అయ్యే వరకు మేనమామగా అండగా ఉంటానని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా చదువుల చరిత్రను మార్చామని ఆయన అన్నారు.