ఎన్నిక‌లు ముగిసి ఏడాదిన్న‌ర‌.. జ‌న‌సేనకు పొలిటిక‌ల్ గ్రాఫ్ ఎంత‌…?

-

రాజ‌కీయాల్లో ఏ పార్టీకైనా ప్ర‌జ‌ల్లో మార్కులు ప‌డ‌డం చాలా ముఖ్యం. గెలుపు, ఓట‌ములు అనే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టినా.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో స్థానం సంపాయించుకోవ‌డం, విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచుకోవ‌డం అనే రెండు విష‌యాలు అత్యంత కీల‌కం. ఈ రెండింటిని పెంచుకుంటే.. గెలుపు గుర్రం ఇప్పుడు కాకుంటే కొన్నాళ్ల‌కైనా ఎక్కేందుకు అవ‌కాశం ఉంటుంది. దీనిని ఏ రాజ‌కీయ పార్టీ అయినా.. పాటించే కీల‌క అంశం. తాజాగా టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు చేప‌ట్టిన పార్ల‌మెంట‌రీ జిల్లాల నియామ‌కాలు కూడా ఈ త‌ర‌హాలోవే. పార్టీని పుంజుకునేలా చేసేందుకు ఆయ‌న ఏడాది స‌మయంలోనే మార్పులు చేర్పుల దిశ‌గా వ్యూహాత్మ‌కంగా ముందుకు క‌దిలారు.

మ‌రి.. ఈ విష‌యంలో మ‌రోకీల‌క పార్టీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన ఏం చేస్తోంది ? గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన‌.. కేవ‌లం ఒకే ఒక్క స్థానంతో స‌రిపెట్టుకుంది. పైగా పార్టీ అధినేతగా ఉన్న ప‌వ‌నే రెండు స్థానాల్లో ఓడిపోయారు. ఈ ప‌రిణామాల‌తో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారిపోయింది. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు గ‌డిచిపోయి.. ఏడాదిన్నర అయింది. ఉన్న ఒక్క‌గానొక్క ఎమ్మెల్యే అధికార పార్టీ వైపు మొగ్గారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల్లో ఎక్క‌డా జ‌న‌సేన అనే మాటే వినిపించ‌డం లేదు. ఆ పార్టీ జెండా కూడా క‌నిపించ‌డం లేదు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు ఏపాత్రా లేదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల్లో లేక‌పోతే.. ఏ పార్టీ ప‌రిస్థితి అయినా ఇంతే!

భావి రాజ‌కీయాల‌పై ప‌ట్టు సాధిస్తాను.. అని ప‌దే ప‌దే చెప్పిన ప‌వ‌న్‌.. ఆదిశ‌గా అడుగులు వేస్తున్న ప‌రిస్థితి మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. చాలా మంది నాయ‌కులు ఈ ఏడాదిన్న‌ర‌లో పార్టీ మారిపోయారు. ఇక‌, జిల్లాల‌కు జిల్లాలే యువ నేత‌లు లేక‌.. ఇక్క‌ట్ల పాల‌వుతోంది. ఇవ‌న్నీ ఇలా.. ఉంటే.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. ఆ పార్టీ ఇటీవ‌ల కాలంలో సొంత‌గా పుంజుకునేందుకు దారులు వెతుక్కొంటోంది. రేపు ఎన్నిక‌ల నాటికి బీజేపీకి త‌న బ‌లంపై త‌న‌కు న‌మ్మ‌కం పెరిగితే.. జ‌న‌సేన‌తో ఎందుకు క‌లిసి రంగంలోకి దిగుతుంద‌నే ప్ర‌శ్న స‌ర్వ‌సాధార‌ణంగా తెర‌మీదికి వ‌స్తోంది.

దీనికి కూడా జ‌న‌సేన‌లో ఆన్స‌ర్ ఇచ్చే వారు లేరు. పైగా ప్ర‌త్యక్ష కార్యాచ‌ర‌ణ అనేది ఇటీవ‌ల కాలంలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. తానే స్వ‌యంగా పోటీ చేసిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితి ఉందో కూడా ప‌వ‌న్ చూడ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన రేటింగ్ గ‌త ఏడాది వ‌ర‌కు ఉన్నది కూడా భారీగా ప‌డిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు ఇదే కొన‌సాగితే.. మున్ముందు మ‌రింత క‌ష్ట‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Latest news