ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన కోడి కత్తి దాడి కేసు విచారణ మే 10వ తేదీకి వాయిదా పడింది. నిందితుడు శ్రీనివాస్ ని రాజమండ్రి జైలు నుంచి వీడియో కాల్ లో ఎన్ఐఏ కోర్టు విచారించింది. పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసును విచారణ జరుపుతామని చెబుతూ తాత్కాలిక న్యాయమూర్తి ఈ కేసును వాయిదా వేశారు. ఈ కేసు విచారణ చేసిన న్యాయమూర్తి ప్రమోషన్ పై కడప జిల్లా కోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన తాత్కాలిక న్యాయమూర్తి ఇంకా పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించలేదు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని గతంలో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను కోర్టుకు హాజరు కాలేనని, అడ్వకేట్ కమిషనర్ ను ఏర్పాటు చేసే విచారించాలని కోరారు. దీనిపై ఇప్పటికే నిందితుడి తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు కీలకమైన విచారణ జరుగుతుందని భావించినప్పటికీ తాత్కాలిక న్యాయమూర్తి కావడం.. పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించకపోవడంతో కేసుని వాయిదా వేశారు.