ఏపీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి సమీపంలో గల శ్రీశైలం జలాశయం వద్ద మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి.
శ్రీశైలం పరిధిలో నిన్నటి నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ పరిధిలోని ఈగలపెంట రహదారి మార్గంలోనూ కొండచరియలు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికే శ్రీశైలం వచ్చే తెలంగాణలోని మున్ననూరు ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌ను మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున శ్రీశైలంకు ఎవరూ రాకూడదని అధికారులు చెబుతున్నారు. కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఇటువైపు రాకపోకలు తగ్గించుకోవాలని సూచించారు. ఇదిలాఉండగా, రహదారిపై పడిన కొండచరియలను క్లియర్ చేసే పనిలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. వాహనాలు ఎక్కడి కక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ సిబ్బంది సైతం వాటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు.