దేవుళ్లకు గుడి ఉంటుందనేది తెలుసు.. కొందరు తమ ప్రియతమ రాజకీయ నాయకులకు.. ఇంకొందరు ప్రేమ మితిమీరి తమ ఫేవరెట్ హీరోయిన్లకు గుడి కట్టడం గురించి కూడా తెలుసు. కానీ ఓ వ్యక్తి తనకు పేగు పంచిన అమ్మకు ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చీమలవలస గ్రామానికి చెందిన సనపల శ్రావణ్‌కుమార్ తల్లిపై తనకున్న అవధుల్లేని ప్రేమను ఇలా చాటుకుంటున్నాడు.
శ్రావణ్‌కుమార్ తల్లిదండ్రులు కృష్ణారావు, అనసూయాదేవి. తల్లి ప్రోత్సాహంతో శ్రావణ్‌కుమార్ ఉన్నత విద్యను అభ్యసించి హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. 2008లో ఆయన తల్లి కన్నుమూశారు. ఆమె జ్ఞాపకాలను కలకాలం గుర్తుంచుకునేలా తన స్వగ్రామం చీమలవలసలో రూ.10 కోట్లతో 2019 మార్చిలో గుడి నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇందుకోసం కృష్ణశిలను మాత్రమే వాడుతున్నారు. పనులు ప్రస్తుతం 70శాతం పూర్తయ్యాయి. యాదాద్రి ఆలయ నిర్మాణ స్తపతుల్లో ఒకరైన బలగం చిరంజీవి, తమిళనాడుకు చెందిన శిల్పి పాండీదురై, ఒడిశాకు చెందిన శిల్పకారులు సురేష్ బృందం ఆధ్వర్యంలో గుడి నిర్మిస్తున్నారు. అమ్మ ప్రేమ గొప్పతనంపై చిత్రాలను ఆలయం మండప స్తంభాలపై చెక్కుతున్నారు.