వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వం పై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. హీరోల రిమ్యునరేషన్ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడుతున్నాయని.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ఫిలిం ఇండస్ట్రీపై ఎందుకు పడుతున్నారని అన్నారు. మీరు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి చూసుకోవాలని.. పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయాలని అన్నారు మెగాస్టార్.
దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో అగ్గిరాజేశాయి. దీంతో వైసిపి మంత్రులు ఒక్కొక్కరుగా చిరు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా పర్యాటకశాఖ మంత్రి రోజా.. మెగాస్టార్ చిరంజీవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకూడదని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం చిరంజీవి ఏం చేశారని ప్రశ్నించారు.
తన పార్టీని విలీనం చేసి రాజకీయ లబ్ధి పొందాలని విమర్శించారు రోజా. సినిమా వాళ్ళు చెబితే వినే స్థాయిలో మేము లేమని.. ఆ సలహాలేవో ఆయన ముందుగా పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలని కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా చిరంజీవి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతుంటే చిరంజీవి అప్పుడేం చేశారని అడిగారు. కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి ఒక్క ప్రాజెక్టు అయినా ఏపీకి తీసుకు వచ్చారా..? అని ప్రశ్నించారు.