ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ తిరుమలలో నిబంధనలను ఉల్లంఘించారు. మంత్రి రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ స్టెయిన్ తన మెడలో అన్యమమత గుర్తు ఉన్న గొలుసు ధరించారని.. అలానే గొల్లమండపం దగ్గర తిరిగారని తిరుమల శ్రీవారి భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి రోజా వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అయితే రోజాతో పాటు ఆమె వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ స్టెయిన్ కూడా తిరుమలకు వచ్చారు. తిరుమలలో అన్యమత గుర్తుల ప్రదర్శనపై నిషేధం ఉండగా.. స్టెయిన్ మెడలో అన్యమత గుర్తు ఉన్న గొలుసు కనిపించడం వివాదం చెలరేగింది.
స్టెయిన్ అలానే.. గొల్లమండపం సమీపంలో తిరిగారు. ఈ వ్యవహారంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో అన్యమత గుర్తులపై నిషేధం ఉన్న సంగతి మంత్రి రోజాకు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. మంత్రి రోజా తిరుమల దర్శనానికి వచ్చిన ప్రతిసారి ఫొటోగ్రాఫర్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘‘రోజక్క తిరుమలకు ఎందుకు అన్ని సార్లు వెళ్తుందో ఇప్పుడు జనానికి ఒక క్లారిటీ వచ్చింది.
నిబంధనలకు వ్యతిరేకంగా మెడలో శిలువ లాకెట్ ధరించి, ఏకంగా తిరుమల గొల్ల మండపం ఎదురుగా నిల్చుని హల్ చల్ చేస్తున్న ఇతనెవరో కాదు. రోజక్క పర్సనల్ ఫోటోగ్రాఫర్. మీకర్ధమవుతుందా?’’ అని టీడీపీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేసింది.