తాడేపల్లిలో కుప్పలు కుప్పలుగా నాగ దేవత విగ్రహాలు

-

ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. తాడేపల్లి పరిధిలోని సీతానగరం ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగాన రాతితో చేసిన నాగ దేవత విగ్రహాలు వెలుగు చూశాయి. సుమారు 50 ప్రతిమలు ఇక్కడ కుప్పలు కుప్పలుగా కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తీసుకొచ్చి ఇక్కడ వదిలి వెళ్లారని గ్రామస్థులు అంటున్నారు. విగ్రహాలన్నీ దెబ్బతిని ఉన్నాయని తెలిపారు.

ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలు తొలగిస్తే నదిలో కలిపే సంప్రదాయం ఉండటంతో వీటిని ఒడ్డున వదిలివెళ్లి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. గతంలో కూడా పశ్చిమ డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నాగ దేవత ప్రతిమలను వదిలి వెళ్లారు. దానికి కూడా ఇదే కారణం అయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ ఇవి పురాతన విగ్రహాలేమోనని భావించిన స్థానికులు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు.

‘ఇవాళ ఉదయం సీతానగరం ప్రకాశం బ్యారీజే ఎగువ భాగంలో కుప్పలు కుప్పలుగా నాగదేవత విగ్రహాలు ఉండటం గమనించాం. వెంటనే అధికారులకు సమాచారం అందించాం. విగ్రహాలన్నీ దెబ్బతిని ఉన్నాయి. అందుకే కృష్ణా నది ఒడ్డున వదిలి వెళ్లారని అనుకుంటున్నాం. కానీ ఒకేసారి ఇన్ని విగ్రహాలు ఎలా దెబ్బతిన్నాయి.. అన్నీ కూడా ఒకే మాదిరి ఉన్నాయి. అందుకే అనుమానం వచ్చి అధికారులకు సమాచారం అందించాం.’ అని స్థానికులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news