వైఎస్సార్‌సీపీ కీలక నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఏపీ ప్రభుత్వం అరెస్టు చేయడంతో మాజీ సీఎం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా జైలులో ఆయన్ను పరామర్శించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న సురేశ్‌ను కలిసేందుకు జగన్ గుంటూరు జిల్లా జైలుకు వెళ్లారు.ఈ ములాఖాత్‌లో నందిగం సురేశ్‌తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను కలిసి వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం జిల్లా జైలు బయట జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.ఇలాంటి దుర్మార్గమైన పాలనను ఎన్నడూ చూడలేదని విమర్శించారు.వరదల వైఫల్యాన్ని డైవర్ట్ చేసేందుకే నందిగం సురేశ్‌ను, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను సీఎం చంద్రబాబు అరెస్ట్ చేయించారని ఆరోపించారు. వరదలను కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందన్నారు. ప్రకృతి విపత్తులో సంభవించిన 60 మంది మరణాలపై ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు.నాలుగేళ్ల క్రితం పట్టాభి తనను బూతులు తిట్టారని,అందుకే వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారన్నారు. ఆ టైంలో ఇరు పార్టీల నేతలు గొడవకు దిగారని, అప్పుడు టీడీపీ కార్యాలయంపై రాళ్లు పడి ఉండొచ్చని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.