ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు కోర్టుకు హాజరయ్యారు. కొంతకాలం క్రితం ఓ దినపత్రికలో “చినబాబు చిరు తిండి రూ. 25 లక్షలు అండి” అనే టైటిల్ తో ఓ కథనం ప్రచురితమైంది. ఆ సందర్భంలో తనపై అసత్య కథనాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నారా లోకేష్ ఆ దినపత్రిక పై కోర్టులో పరువునష్టం దావా వేశారు.
అయితే వివిధ కారణాలవల్ల ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది. నేడు ఈ కేసు విచారణ ప్రారంభం కావడంతో నారా లోకేష్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సొంత ఖర్చులకు ప్రభుత్వ సొమ్మును ఏనాడు వినియోగించుకోలేదని తెలిపారు. అలాంటిది చిరుదిండి ఖర్చు 25 లక్షలు అని తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. మీడియా అనేది బాధ్యతగా ఉండాలని హితువు పలికారు నరా లోకేష్.
ఇదిలా ఉంటే.. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా భూ ఆక్రమణలు జరిగాయని అన్నారు లోకేష్. ఎక్కడ ఎన్ని ఎకరాల అక్రమాలు జరిగాయో త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వైసిపి ప్రభుత్వం వైఖరి వల్ల రాష్ట్రం నుంచి పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని.. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక పారిశ్రామికవేత్తలు మళ్లీ ఏపీకి వస్తున్నారని తెలిపారు.