ఏపీలో ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆంధ్రా ప్రజలు కూటమికే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘనవిజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమిపై గురుతరమైన బాధ్యత పెట్టారని అన్నారు.
‘‘దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు.. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు.. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్లేందుకు గొప్ప బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత నెరవేర్చేందుకు అహర్నిశలు కష్టపడతాం. 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెస్తాం. ప్రజలు ఇచ్చిన విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటాం. 1985 నుంచి మంగళగిరిలో పసుపు జెండా ఎగరలేదు. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు ఉంటాయి. కక్ష సాధింపులు, వేధింపులు లాంటివి మాకు తెలియదు. ప్రభుత్వంలో నా పాత్ర ఏంటో చంద్రబాబు నిర్ణయిస్తారు. ’’ అని లోకేశ్ స్పష్టం చేశారు.