కుల సమీకరణలతో సింహపురిలో టీడీపీ సీన్ మారనుందా…?

-

నెల్లూరు జిల్లా ఒకప్పుడు టిడిపికి కంచుకోట. ఒక్కప్పుడు పదికి పది సీట్లు సాదించిన చోట ఇప్పుడు అన్ని చోట్ల ఓడిపోయి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు అన్ని సీట్లు ఓడి ఇప్పుడు ఉనికి పోరాటంలో పడింది టిడిపి. అధినేత రాజకీయంతో పాటు ఇక్కడి నాయకుల తీరు కూడ ఇక్కడ పార్టీ కుదేలవ్వడానికి కారణమైందన్నది కార్యకర్తల వాదన. ఈసారి పార్లమెంట్‌ ఇన్‌ చార్జ్‌ లుగా బిసీలు, మైనార్టీలకు ఛాన్సిచ్చింది. ఈ వ్యూహంతో అన్న సింహపురిలో టీడీపీ సీన్ మారుతుందా అన్ని తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు.


2014 ఎన్నికల్లో నెల్లూరులో 3చోట్ల విజయం సాధించిన టీడీపీ, 2019లో జీరో గా మారిపోయింది. ఇన్ చార్జ్ లు అందుబాటులో లేక పోవడంతో చాలచోట్ల స్థానిక సంస్థల్లో కనీసం నామినేషన్లు కూడా వేయ్యలేక పోయారు. అయితే జిల్లాలో పెద్దదిక్కుగా వున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్రలు పార్టీ కార్యక్రమాలలో యాక్టివ్ వుగా వుంటే, చాలామంది నాయకులు మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుండిపోయారు. ఐదు సంవత్సరాల పాటు తిరుగులేని మంత్రిగా అధికారం చెలాయించిన నారాయణ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు.

జిల్లాలో ఎవరేమనుకున్నా, రెడ్డి సామాజిక వర్గానిది రాజకీయంగా తిరుగులేని అదిపత్యం. ఇక్కడ మిగతా సామాజిక వర్గాలు అర్థికంగా బలంగా వున్నప్పటికి రెడ్డి సామాజక వర్గం ముందు వీరు రాజకీయంగా మనలేక పోతున్నారు. తాజాగా టిడిపి రెడ్డి సామాజిక వర్గాన్ని కాదని నెల్లూరు పార్లమెంట్ అద్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మాజీ మేయర్, నెల్లూరు రూరల్ ఇన్ చార్జీ అయిన అబ్ధుల్ అజీజ్ ను నియమించింది.అజీజ్ గతంలో వైసీపీలో మేయర్ గా ఎన్నికై టిడిపిలో చేరి ఇక్కడే కొనసాగుతున్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో మైనార్టీ ఓట్లు భారీగానే ఉన్నాయి.

ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కోవూరు, నెల్లూరు, నెల్లూరు రూరల్, ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గాల్లో కలిపి ఏకంగా రెండున్నర లక్షల ఓట్లున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో గెలుపు ఓటములను వీరు ప్రభావితం చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా నెల్లూరుకు సంబంధించి ఈ ప్రయోగం చేయలేదు. టిడిపి చేసిన ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అనేదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని నాయకులంతా అజీజ్ మాటను అనుసరిస్తారా వారిని కలుపుకుపోతారా అనేది ఇప్పుడు ప్రశార్థకంగా మారింది.

అటు తిరుపతి పార్లమెంటు అద్యక్షుడిగా నరసింహయాదవ్ ను నియమించారు. టిడిపిలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి తుడా చైర్మన్ గా కూడా పనిచేసారు నరసింహ యాదవ్. తిరుపతి పార్లమెంట్ పరిధిలో యాదవులు బలమైన సామాజిక వర్గం. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, చిత్తూరు జిల్లాల స్థానాలు కాగా సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరు పేట నియోజకవర్గాలు ఇందులో వున్నాయి. ఇక తిరుపతిలో అయితే ఎన్నికలకు ముందు నరసింహ యాదవ్ కు మాజీ ఎంఎల్ఎ సుగుణమ్మ మద్య విభేదాలు తలెత్తాయి. ఇక్కడ హోరా హోరీగా పోరు జరిగింది.

నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులైన సోమిరెడ్డిని, కడప జిల్లా ఇన్ చార్జ్ గా నియమించారు. గతంలో కూడా అయన ఇన్ చార్జ్ గా వున్నారు. బీద రవిచంద్రను రాష్ట ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారనే టాక్ఉంది. జిల్లాలో ఇంకా చాలమంది నాయకులకు రాష్ట స్థాయి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు నియోజకవర్గానికే పరిమితం అయిన అబ్ధుల్ అజీజ్ నెల్లూరు పార్లమెంట్ లోని ఇతర నేతలను సమన్వయం చేసుకుని నడపగలరా? అటు నరసింహాయాదవ్ తిరుపతి పార్లమెంట్ ను సమన్యయం చేయగలరా అనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news