ఏపీ ఉద్యోగులకు బిగ్ షాక్..1 వ తేదీ వచ్చి వారమైనా జీతాలు అందలేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో సుమారు 60% మందికి జనవరి నెల జీతం ఇంతవరకు అందనేలేదు. ఫిబ్రవరి 6 తేదీ వచ్చినా జీతాలు పడకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉపాధ్యాయుల్లో దాదాపుగా ఎవ్వరికీ రాలేదు.
వ్యవసాయ శాఖలోనూ ఇలాంటి పరిస్థితి కొన్ని శాఖల్లో కొందరికి ఇవ్వగా, మరికొందరికి ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చేది అధికారులు స్పష్టంగా చెప్పడం లేదు. ఈ నెల జీతం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి నెల జీతభత్యాలకు కలిపి దాదాపు రూ.6 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని ఇప్పటివరకు రూ. 2 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొంటున్నారు. జీతాలు చెల్లించాలని కోరుతూ ఏపీ సచివాలయం ఎస్ఓల సంఘం అధ్యక్షుడు రంగస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి సోమవారం వినతి పత్రం సమర్పించారు.