సచివాలయాల ఉద్యోగులకు జగన్ షాక్.. సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. సర్వీసు నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన అన్ని రకాల సెలవులు సచివాలయాల ఉద్యోగులకు వర్తిస్తాయని పురపాలక శాఖ ఒకవైపున చెబుతూనే, ఇంకోవైపున పన్నుల బకాయిలు వసూలు చేసే వరకు సెలవులు లేవని పూర, నగరపాలక సంస్థల్లో అధికారులు ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశం అవుతుంది.
ఆస్తిపన్ను, నీటి, యుజిడి చార్జీలు, వినియోగ రుసుముల బకాయిలు మార్చి నెల 31 లోగా వసూలు చేయాల్సి ఉన్నందున సెలవు దినాల్లోనూ విధులకు హాజరవ్వాలని అధికారులు ఆదేశించడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ తరపున ఈ నెల రెండున అధికారులు జారీ చేసిన సర్క్యులర్ నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. మిగతా నగరపాలక సంస్థల్లోనూ ఇదే విధమైన ఉత్తర్వులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.