నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా రెండవసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో వచ్చే ఎన్నికలలో పొత్తుల గురించి క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటామని, అవసరమైతే పార్టీలను ఒప్పిస్తామని స్పష్టం చేశారు. తాము 2019లోనే పూర్తిస్థాయిలో రాజకీయాలలోకి వచ్చామని తెలిపారు. గత ఎన్నికలలో 137 స్థానాలలో పోటీ చేసినట్లు తెలిపారు పవన్ కళ్యాణ్.
అయితే అప్పుడు కనీసం కొన్ని స్థానాలను అయినా గెలిచి ఉంటే ఇప్పుడు బలంగా ఉండేవాళ్ళం అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రైతులకు ఏ కష్టం వచ్చినా తాను ఊరుకోనని హెచ్చరించారు. అన్నం పెట్టే అన్నదాతలను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం జగన్ రెడ్డి పై ఉందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.