చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన చేస్తున్న రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే. గత 90 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న 2.52 ఎకరాల వ్యవసాయ భూమిని తిమ్మి నాయుడు కండ్రిగ గ్రామస్తులు ఆక్రమించుకున్నారని రైతు పి రత్నం శుక్రవారం నుంచి ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేపట్టాడు. గ్రామస్తుల ఆక్రమణ నుంచి తన భూమిని కాపాడుకునేందుకు కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు.
అప్పటినుంచి గ్రామస్తులు తనను ఇబ్బందులకు గురి చేయడంతో ఎమ్మార్వో కార్యాలయం ముందు న్యాయపోరాటానికి దిగాడు. అయితే అధికారులు అడ్డుకోకపోవడంతో మనోవేదనకు గురై రైతు అధికారులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. పి రత్నం నాయుడు మృతి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వ అలసత్వానికి రైతు బలైపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే రైతు ప్రాణం నిలబడి ఉండేదని.. అక్రమ కేసులు పెట్టే వైసిపి ప్రభుత్వానికి ఇలాంటివి పట్టించుకునే సమయమే లేదని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.