ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జనసేనాని పవన్ కల్యాణ్ తొలిరోజు నుంచే తన విధుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ దిశగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ నుంచి అక్రమంగా తరలిపోయి నేపాల్ దేశంలో దొరుకుతున్న ఎర్ర చందనాన్ని వెనక్కి తీసుకురావాలని అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు. నేపాల్ దేశంలో 172 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం దొరికిందని.. ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టడానికి టాస్క్ ఫోర్స్‌ను బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో వెలువడే కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేయాల్సిందేనని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఏయే పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల కలుషితంపై ప్రత్యేకంగా సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.