తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ పరుగులు పెట్టడం ఖాయమా? గత వైభవాన్ని తిరిగి పొందడం సాధ్యమేనా? అంటే ఔననే అంటున్నారు ఇక్కడి తమ్ముళ్లు. 2014లో ఇక్కడ పార్టీ విజయం సాధించింది. కాకినాడ ఎంపీగా తోట నరసింహం విజయం సాధించారు. అయితే, ఆయన పార్టీపై ఎక్కువగా దృష్టి పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నే గత ఏడాది ఇక్కడ పార్టీ ఓడిపోయింది. ఇక, అప్పటి నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించే తమ్ముళ్లు కూడా కనిపించలేదు. ఎప్పటికప్పుడు ఇక్కడ నాయకత్వానికి జవసత్వాలు ఇవ్వాలని చంద్రబాబు కోరుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం.. పార్టీకి ఊపు తెస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇటీవల పార్టీ పార్లమెంటరీ జిల్లా ఇంచార్జ్‌లను చంద్రబాబు నియమించారు. ఈ క్రమంలోనే కాకినాడ పార్లమెంటరీ జిల్లా చీఫ్‌గా బండారు సత్యనారాయణ మూర్తికి అవకాశం ఇచ్చారు. సీనియర్ నాయకుడు, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న నేత కావడంతో ఈయన ఎంపికపై ఎలాంటి విమర్శలు, వివాదాలు రాలేదు. పైగా ఆయన వల్ల పార్టీ బలపడడం ఖాయమని సీనియర్లు కూడా భావించారు. తాజాగా బండారు సత్యనారాయణ మూర్తి.. కాకినాడ నియోజకవర్గంపై మీటింగ్ ఏర్పాటు చేశారు.
నిజానికి ఇటీవల రాజమండ్రి నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా ఎంపికైన మాజీ మంత్రి జవహర్.. మీటింగ్ పెట్టారు. దీనికి కీలక నేతలు ఒక్కరుకూడా రాలేదు. కానీ, సత్యనారాయణ మూర్తి మీటింగ్ మాత్రం అదిరిపోయిందనే టాక్ వచ్చింది. మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు, వర్మ, తుని పార్టీ ఇంచార్జ్ యనమల కృష్ణుడు వంటి కీలక నాయకులు చాలా మంది హాజరై.. బండారు నాయకత్వానికి జై కొట్టారు. అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ఇక, ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో పూర్తిస్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించారు. దాదాపు 15 ప్రధాన కమిటీలతో పాటు, మరో 10 వరకు మండలస్థాయి కమిటీలువేయాలని తీర్మానం చేశారు. దీంతో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీలో కొత్త జోష్ ఆరంభమైందనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే, ఇక్కడ బలంగా ఉన్న వైసీపీని నిలువరించడం, ముఖ్యంగా టీడీపీ ఓటు బ్యాంకును చెక్కుచెదరకుండా చూడడంపైనా నాయకులు చర్చించారు. మొత్తానికి పార్లమెంటరీ జిల్లాలో బండారు వ్యూహం సక్సెస్ అవుతుందని అంటున్నారు పరిశీలకులు.