ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయం సాదించిన వైఎస్సార్ సీపీ నాయకుడు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహారం ఆసక్తిగా మారింది. ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, సురేష్ రాజకీయ ప్రస్థానం తీసుకుంటే.. ప్రముఖ విద్యాసంస్థల అధినేతగా ఆయన తండ్రికి ప్రకాశంజిల్లాలో పేరుంది. ఇక, సురేష్ కూడా ఐఆర్ ఎస్ అధికారిగా పనిచేశారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉంటే రెవెన్యూ శాఖలోనే పనిచేశారు.
అయితే, 2009లో అప్పటి వైఎస్ హయాంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సురేష్ ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి ఘన విజయం దక్కించుకున్నారు. అయితే, ఆయన గెలిచిన తర్వాత.. రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్ మరణం, రాష్ట్ర విభజన ఒకదాని తర్వాత ఒకటి రాష్ట్రాన్ని ఊపేశాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలో ఏ ఒక్క అభివృద్ధి పనినీ సురేష్ చేపట్టింది లేదు. దీంతో ఇక్కడ ఆయనకు ఫుల్ యాంటీ ఏర్పడింది. ఇక, రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో కాంగ్రెస్ పూర్తిగా నీట మునిగింది.
ఈ నేపథ్యంలో 2014 ఎన్నికలకు రెండు మాసాల ముందు వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. వచ్చిన వెంటనే ఎన్నికల్లో టికెట్ సంపాయించుకున్నారు. అయితే, ఎర్రగొండపాలెంలో అయితే.. తనపై వ్యతిరేకత ఉంది కాబట్టి.. ఓడిపోతానని గ్రహించిన ఆయన.. సంతనూతల పాడుకు మారారు. అక్కడి నుంచి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాకపోవడంతో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనినీ చేపట్టలేదు. దీంతో ఇక్కడ కూడా వ్యతిరేకత ఏర్పడింది. దీంతో గత ఏడాది ఎన్నికల్లో మళ్లీ.. ఎర్రగొండ పాలేనికి మారిపోయారు.
అయితే, ఇప్పుడు కూడా ఆయనకు మైనస్ మార్కులే పడుతున్నాయి. ఒకవైపు ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ.. ఆయన నియోజకవర్గంలో ఎక్కడా అందుబాటులో ఉండడంలేదు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉండడం, మరీముఖ్యంగా సీఎం జగన్ సొంత జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉండడంతో ఆదిమూలపు సురేష్ కేవలం విజిట్ చేసేందుకు మాత్రమే అన్నట్టుగా ఎర్రగొండపాలెంను మార్చుకున్నారనే వాదన వినిపిస్తోంది. మరి ఇలాగే కొనసాగితే.. మున్ముందు కష్టమేనని అంటున్నారు పరిశీలకులు.