వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఈనెల 19వ తేదీన కడప ఎంపీ వై.యస్. అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ తధ్యంగా కనిపిస్తోందని, వై.యస్. అవినాష్ రెడ్డి గారికి కొండంత అండగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఇన్నాళ్లు మనం అనుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం గారు చెప్పిన నిజం విన్న తర్వాత, జగన్ మోహన్ రెడ్డి గారు తనని తాను రక్షించుకునేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.
ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాధాకృష్ణ గారు రాసినట్లుగా జగన్ మోహన్ రెడ్డి గారికి ఆయన బాబాయి మరణ వార్త తెల్లవారుజామునే తెలిసిందని అజయ్ కల్లం గారు చెప్పుకొచ్చారని, ఉదయం నాలుగు నుంచి నాలుగున్నర గంటలకే వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని జగన్ మోహన్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చిన అదృశ్య వ్యక్తి ఎవరు? అని, ఆయనకు వివేకా గారు మరణించిన విషయం ఎలా తెలిసిందని ప్రశ్నించారు.
ఎందుకంటే ఆ రోజు ఉదయం 6 గంటలకు లచ్చమ్మ వివేకానంద రెడ్డి గారి ఇంటికి చేరుకున్నారని, వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి ఉదయం ఆరు గంటల 15 నిమిషాలకు ఆయన ఇంటికి చేరుకోగా, అప్పటికి వివేకానంద రెడ్డి గారు నిద్ర లేవలేదని, ఇదే విషయాన్ని ఆయన భార్యకు ఫోన్ చేసి చెప్పారని, నిద్ర లేపమని వివేకానంద రెడ్డి గారి సతీమణి చెప్పడంతో వారు ఇంట్లోకి ప్రవేశించారని, దీనితో వివేకానంద రెడ్డి గారు మరణించిన విషయం ప్రపంచానికి తెలిసిందని అన్నారు.