రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎరువుల ధర పెంచకూడదని నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో రైతులకు అందించే ఎరువులపై రూ.1.08 లక్షల కోట్ల రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ఫాస్పరస్, పొటాషియం ఎరువులకు రూ.38,000 కోట్లు, యూరియాకు రూ.70,000 కోట్లు ఇవ్వనుంది. ధరలనూ పెంచకూడదని నిర్ణయించింది.
బుధవారం దిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలను ఆమోదించినట్లు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రస్తుతం యూరియా బస్తా ధర రూ.276, డీఏపీ బస్తా ధర రూ.1,350 ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. సబ్సిడీవల్ల 12 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారని వెల్లడించారు. 2023-24 లో మొత్తం ఎరువుల సబ్సిడీ బిల్లు 2.25 లక్షల కోట్లని తెలిపారు. నైట్రోజన్‌పై రూ.76, ఫాస్పరస్‌పై రూ.41, పొటాష్‌పై రూ.15, సల్ఫర్‌పై రూ.2.8 సబ్సిడీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ చెప్పారు.