వైసీపీ పార్టీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని హెచ్చరించారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలను, రాష్ట్ర పరిపాలన విభాగం, పోలీస్ శాఖలోకి తీసుకువచ్చిన నిజమైన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారిదేనని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కక్ష రాజకీయాలను కొనసాగిస్తున్నారని, కమర్షియల్ టాక్స్ ఉద్యోగ సంఘాన్ని రద్దు చేయాలని చూడడం దారుణం అని, అలాగే అమరావతిపై కక్ష సాధింపుతో 1130 ఎకరాలను రాష్ట్రంలోని పేదలకు పంచుతామని అంటున్నారని అన్నారు.
ఇప్పటికే పూర్తి అయిన 5000 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించని జగన్ మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర రాజధాని అమరావతిలో మాత్రం గుడిసెలు వేసుకోవడానికి 1130 ఎకరాలను కేటాయిస్తాననడం దారుణం అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏమిటో న్యాయమూర్తులకు అర్థం కాదా?, ఒక న్యాయమూర్తి గారు ఈ కేసు విచారణ చేస్తున్న బెంచ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించారని, ఆయనపై ఎంతో ఒత్తిడి ఉంటే తప్పితే, ఈ నిర్ణయం తీసుకొని ఉండరని అన్నారు. తమ బంగారం మంచిది కాదు కాబట్టే న్యాయమూర్తి గారు బెంచ్ నుంచి తప్పుకోవాలని భావించి ఉంటారని, రాష్ట్ర హైకోర్టులో అమరావతి రైతులకు అనుకూలంగానే తీర్పు వెలువడుతుందని రఘురామకృష్ణ రాజు గారు ఆశాభావం వ్యక్తం చేశారు.