రాజుగారు ఇప్పుడు పాత్రికేయ విలువ‌లు మ‌రిచిపోయారే..!

-

“మీడియా.. అన్నాక అనేక విష‌యాలు తెలుస్తుంటాయి. వారు రాస్తారు. దీనిలో కొన్ని నిజాలు ఉండొచ్చు. లేక‌పోయి కూడా ఉండొచ్చు. ఈ మాత్రానికే నేత‌లు ఉలికి ప‌డిపోతే ఎలా?!  పాత్రికేయ విలువ‌లు కాపాడాలి. సంయ‌మ‌నం పాటించాలి“- ఇదీ.. న్యాయమూర్తుల ఫోన్ ట్యాంపిగుల వ్య‌వ‌హారంపై ఓ మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాలు త‌ప్పంటూ.. వైసీపీకి చెందిన కొంద‌రు నాయ‌కులు మాట్లాడ‌డంపై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు ఢిల్లీలో చేసిన వ్యాఖ్య‌లు. దీనికి ముందు కూడా వైసీపీ నేత‌ల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు, క‌థ‌నాల‌ను ఆయ‌న స‌మ‌ర్థించారు. “మీడియాపై విమ‌ర్శ‌లేంటండీ. ముందు మీరు నిజాయితీగా ఉండండి!“ అని సుద్దులు చెప్పారు.

మంచిదే.. ర‌ఘురామ రాజు చెప్పిన ప్ర‌తిమాటా మంచిద‌నే అనుకుందాం. పాత్రికేయ విలువ‌లు పాటించే ఓ వ‌ర్గం మీడియా జ‌గ‌న్ ప్ర‌భుత్వం పైనా, ఆయ‌న పార్టీ నేత‌ల‌పైనా విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని భావిద్దాం. మ‌రి సూత్రం త‌న‌కు వ‌ర్తించ‌దా?  పాత్రికేయ విలువ‌లు త‌న వ‌ర‌కు వ‌చ్చే స‌రికి ర‌ఘురామ పాటించ‌రా? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న రాజ‌కీయ వ‌ర్గాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ముఖ్యంగా పార‌ద‌ర్శ‌కంగా, త‌ట‌స్థంగా ఉండే మీడియా వ‌ర్గాలు ఆయ‌న‌కు సంధిస్తున్న ప్ర‌శ్న‌కూడా ఇదే! మ‌రి ఏం జ‌రిగింది? ర‌ఘురామ ఎందుకిలా ప్ర‌శ్న‌ల‌కు గుర‌య్యారు అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామంలో ర‌ఘురామ రాజు ఓ బ్యాంకుకు చెందిన అప్పును తిరిగి చెల్లించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న ఉంది.

దీనిపై బ్యాంకు వారిచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు న‌మోదు చేసిన‌ట్టు ఆయ‌న‌ను స‌మ‌ర్ధించే మీడియాలోనే క‌థ‌నాలు వ‌చ్చాయి. స‌హ‌జంగానే మీడియాలో ఉన్న వైఖ‌రి కార‌ణంగా.. సీబీఐ అధికారులు ర‌ఘురామ ఇంటిని, వ్యాపార సంస్థ‌ల‌ను కూడా త‌నిఖీ చేశార‌ని, ఆయ‌న‌ను త్వ‌ర‌లోనే అరెస్టు కూడా చేస్తున్నార‌ని జ‌గ‌న్‌కు చెందిన మీడియా ప్ర‌చారం చేసింది. అయితే, దీనిపై ర‌ఘురామ అగ్గిమీద గుగ్గిలంగా మారిపోయారు. సీబీఐ దాడులంటూ తనపై దుష్ప్రచారం చేశారని, సాక్షి పత్రిక, టీవీపై పరువు నష్టం దావా వేస్తానని రఘురామ స్పష్టం చేశారు.

దీనిపై న్యాయవాదితో సంప్రదించినట్లు చెప్పారు. మ‌రి ఇప్పుడు గ‌తంలో వ‌ల్లించిన పాత్రికేయ విలువ‌లు గుర్తుకు రావ‌డం లేదా?  రాజుగారు అని ప్ర‌శ్నిస్తున్నాయి పాత్రికేయ సంఘాలు. దీనికి ఆయ‌న ఏం స‌మాధానం చెబుతారో చూడాలి. లేక ఇలా ప్ర‌శ్నించిన వార‌పైనా కేసులు పెడ‌తారేమో చూడాలి. ఏదేమైనా.. న‌రం లేనినాలుక అంద‌రికీ ఉన్న‌ట్టే రాజుకి కూడా ఉందిగా ! అంటున్నారు విశ్లేష‌కులు.

 

-Vuyyuru Subhash

Read more RELATED
Recommended to you

Latest news