పింఛన్ల కోసం నడిరోడ్డుపై ఎండలో వృద్ధులను నిలబెట్టిన పాపం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిదేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. వృద్ధాప్య పింఛన్లు తీసుకునే 56 లక్షల మందిలో ఏ ఒక్కరు కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి ఓటు వేయవద్దని ఆయన కోరారు. ఇద్దరు ప్రభుత్వ అధికారులతో కలిసి మండుటెండల్లో వృద్ధులను నిలబెట్టడానికి జగన్ మోహన్ రెడ్డి గారు కుట్ర చేశారన్నారు. ఆ కుట్రను ప్రజలు… వృద్ధులు గ్రహించాలని కోరారు.
వృద్ధులను రాచిరంపాన పెట్టి, ఆ నిందను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిపై, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిపై వేయాలన్న దురుద్దేశంతోనే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలంటే… వృద్ధులు అంటే ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉందా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణ రాజు గారు, కపట ప్రేమ, దొంగ ప్రేమను జగన్ మోహన్ రెడ్డి గారు చూపెడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి గారి దొంగ ప్రేమల గురించి ఆయన చెల్లెలే ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారని పేర్కొన్నారు.