రక్తపు కూడు సంపాదన ఎవరి కోసమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. మీకు ఉన్నది ఇద్దరు కూతుర్లు మాత్రమే… వారు కూడా రేపు ఈ రక్తపు కూడు సంపాదన వద్దనే అంటారని, ఇప్పటికే మీకు 50 ఏళ్ల వయసు దాటిందని, బాగా బ్రతికితే మరో 30 ఏళ్ల పాటు జీవిస్తారని, వయసు పైబడిన వారంటే మీకు గౌరవం లేదని, వయసు పైబడిన వారిని ముసలి వాళ్లు అంటూ చీదరించుకుంటారని, మీరు నిండు నూరేళ్లు బ్రతికినా నెలకు కోటి రూపాయల చొప్పున ఖర్చు చేసినా 550 కోట్ల రూపాయలు సరిపోతాయని, మరి ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని రక్తపు కూడు సంపాదించడం మీకు అవసరమా? అంటూ నిలదీశారు.
ఇప్పటికైనా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే వ్యాపారాలను మానేయాలని రఘురామకృష్ణ రాజు గారు కోరారు. సారా వ్యాపారం చేసిన వారు ఎవరు కూడా బాగుపడిన దాఖలాలు లేవని, తాను కొన్ని కుటుంబాలను స్టడీ చేసే ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. సిబిఎన్ ఫోరం మహిళలతో జరిగిన పరిచయ కార్యక్రమంలో గ్రామ గ్రామాన గంజాయి లభిస్తున్నట్లుగా వారు తెలిపారని, టూత్ పేస్ట్ దొరకడం కష్టమేమో కానీ రాష్ట్రంలో గల్లీ గల్లీలో గంజాయి దొరుకుతుందని చెప్పారన్నారు. ఇంత జరుగుతుంటే ఎక్సైజ్, స్పెషల్ టీములు ఏమి చేస్తున్నాయని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. కంచే చేను మేసిన చందంగా సర్కారు వారి సహకారం లేకపోతే ఇంత విశృంఖలంగా గంజాయి లభిస్తుందా ? అని నిలదీశారు.