ఏపీలో పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ బలం పెరుగుతోంది – రఘురామ

-

ఏపీలో పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ బలం పెరుగుతోందన్నారు రఘురామ. ఆంధ్ర ప్రదేశ్‌…రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల ఓట్లను చీలనివ్వనని మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేయడంతో పాటు, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తుపై క్లారిటీని ఇచ్చారని రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు. గత రెండు మూడు రోజులుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తు ఉండదని తమ పార్టీ నాయకులు ఆనందపడ్డారని, కొన్ని చానల్లో డిబేట్లు కూడా నిర్వహించారని అన్నారు.

అయినా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల మధ్య రానున్న ఎన్నికల్లో పొత్తు ఉంటుందని తాను చెబుతూనే వస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ఇదే పాలన కొనసాగితే ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని, ప్రజల కోసం పోరాడే పార్టీలు ఏకమై, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు. రాష్ట్రంలో సొంత బలాన్ని పెంచుకునే పనిలో పవన్ కళ్యాణ్ గారితో పాటు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఉన్నారని, తన బలాన్ని మరింత పెంచుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని అన్నారు.

రానున్న ఎన్నికల్లో ఎవరి బలాన్ని బట్టి వారు సీట్లను పంచుకునే అవకాశం ఉందచేంజ్, పొత్తులపై పవన్ కళ్యాణ్ గారు స్పష్టతతో ఉండగా, జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం తీవ్ర అయోమయం, గందరగోళంలో ఉన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిపై తమ పార్టీలోని కాపు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిపై పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలను కూడా కాపు నేతలతో తిప్పి కొట్టించే బదులు, రెడ్డి నాయకుల చేత ఎందుకని ఖండించడం లేదో జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పాలని అన్నారు. ఒకే కులం నేతల మధ్య చిచ్చు పెట్టి చలి మంటలు కాచుకోవడం జగన్ మోహన్ రెడ్డి గారికి అలవాటేనని, పవన్ కళ్యాణ్ గారిపై తమ పార్టీ కాపు నాయకుడు విమర్శలు చేసినప్పుడు మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడి ఉంటే బాగుండేదని తాను అన్నానని, ముద్రగడ పద్మనాభం తనకు స్నేహితుడని, ఆయన గతంలో ఉద్యమాలు చేసినప్పుడు పద్మనాభం గారి వెన్నంటే తానూ ఉన్నానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news