ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 76% మంది ఉన్న బిసి, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకవర్గమండలిలో కేవలం 6 మందికే స్థానం కల్పిస్తారా?, ఐదు శాతం మాత్రమే ఉన్న ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి మాత్రం ఏడు పదవులు కేటాయించడం ఎంత వరకు సమంజసమని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మరొక 50 మందిని నియమించినప్పటికీ, కోర్టు, ఆ నియామకాలను నిలిపివేసిందని వెల్లడించారు.
టీటీడీ పాలకమండలి సభ్యుడిగా మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చిన శరత్ చంద్రారెడ్డిని నియమించిన విషయాన్ని విలేకరులు రఘురామకృష్ణ రాజు గారి దృష్టికి తీసుకురాగా, 32 ఆర్థిక నేరాభియోగ కేసులలో 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి, బెయిల్ పై వచ్చిన వ్యక్తి ఒక్క అవకాశం అంటే ప్రజలు మోసపోయి గెలిపించారని… అటువంటి వ్యక్తి పాలనలోశరత్ చంద్రారెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కేవలం 6 మందికి పాలకవర్గంలో చోటు కల్పించి, వారి ఫోటోలను సాక్షి దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెబుతూ జనాభా ప్రాతిపదికన టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకంలో మాత్రం మొండి చేయి చూపించారని మండిపడ్డారు.