ఈ నెల 25న రిలీజైన ఆర్ఆర్ఆర్. రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్న చిత్రం. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించిన రఘురామ. ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతంగా నటించారని కితాబు.రౌద్రం రణం రుధిరం… సంక్షిప్తంగా ఆర్ఆర్ఆర్. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రాజమౌళి సినిమా బాక్సాఫీసును కొల్లగొడుతోంది.
తొలిరోజే రూ.223 కోట్ల వసూళ్లతో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పిన ఆర్ఆర్ఆర్… ఈ వారంలో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ చిత్రం బ్రహ్మాండమైన విజయం సాధించడంతో దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇతర యూనిట్ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. సెలబ్రిటీలు సైతం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసి చిత్రబృందంపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించారు. తన స్పందనను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. “ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను. కళ్లు చెదిరిపోయాయంటే అతిశయోక్తి కాదు. భీమ్ పాత్రలో ఎన్టీఆర్, రామ్ గా రామ్ చరణ్ అద్భుతమైన నటన కనబర్చారు. వెండితెరపై కథను చెప్పడంలో తనకు తిరుగులేదని రాజమౌళి మరోసారి నిరూపించుకున్నారు. ఇంతటి భారీ విజయాన్ని సాధించిన యావత్ చిత్రబృందానికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను” అంటూ వివరించారు.