తెలుగు రాష్ట్రాల్లో రథసప్తి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తమ ఆరాధ్య దైవమైన సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి నిజరూప దర్శనం కోసం భక్తులు శుక్రవారం రాత్రి నుంచే గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు.
అర్ధరాత్రి దాటిన తరువాత పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు, ఇతర ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో సాధారణ భక్తులను పట్టించుకోలేదు. మరోవైపు క్యూలైన్లలో ఇబ్బంది పడుతున్న భక్తులు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లో పర్యవేక్షణ అంతంతగా ఉండటంతో సాధారణ భక్తులు సైతం అదే వరుసలో వెళ్లిపోయారు. దీనిపై పలువురు భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.