రోజురోజుకు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కాయగూరలు కొందామని మార్కెట్కు వెళ్తున్న సామాన్యులు ధరలు చూసి తట్టుకోలేక ఖాళీ సంచులతో ఇంటికి తిరుగు పయనమవుతున్నారు. కూరల్లో అత్యంత ముఖ్యమైన టమాట, మిర్చిల ధరలు అన్నింటికంటే ఎక్కువగా ఉండటంతో బెంబేలెత్తిపోతున్నారు.
చాలా వరకు అవి లేకుండా కూరలు చేస్తూ మమ అనిపిస్తున్నారు. ఈ తరుణంలో ఏపీలోని మదనపల్లె టమాటా మార్కెట్లో ఆదివారం ధరలు తగ్గాయి. ఒక్కసారిగా కిలోకు రూ.30 తగ్గింది. అంతకుముందు 2 రోజుల్లో 750, 726 టన్నుల టమాటా మాత్రమే మార్కెట్లో విక్రయానికి రాగా, నిన్న 1320 టన్నుల టమాటా విక్రయానికి రావడంతో ధరలు తగ్గాయి. మొదటి రకం టమాటా ధర గరిష్టంగా కిలో రూ.98, రెండో రకం టమాటా ధర కనిష్టంగా రూ. 72 కు తగ్గింది. 30 కేజీల క్రేట్ ధర మొన్నటితో పోలిస్తే రూ.1000 తగ్గింది.