తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు వారంతా. స్వామి వారికి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ప్రసాదం తీసుకుని స్వామిని తలుచుకుంటూ ఇంటికి బయల్దేరారు. కానీ దారిలో వారి కోసం మృత్యువు కాచుకొని ఉందని గ్రహించలేదు. లారీ రూపంలో దూసుకొచ్చిన ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
అన్నమయ్య జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కేవీపల్లి మండలం మఠంపల్లి వద్ద తుఫాన్ వాహనం-లారీ ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో 11 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను తిరుపతి రుయా అసుపత్రికి తరలించారు. తిరుమలకు వచ్చి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రం బెళగావి వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ఈ ఘటన జరిగిందా లేదా నిద్రమత్తులో చోటుచేసుకుందా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.