నెల్లూరు జిల్లాలోని బారాషహీద్ దర్గాలో ఐదు రోజుల పాటు సాగే రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం బారాషాహీద్ దర్గా వద్ద నిర్వహించే రొట్టెల పండగను వీక్షించేందుకు హిందూముస్లిం అనే బేధం లేకుండా అతీతంగా భక్తులు తరలివచ్చారు. మూడోరోజు రొట్టెల పండగ సందర్భంగా సీఎం చంద్రబాబు అక్కడికి వచ్చిన భక్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రొట్టెల పండగకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వేడుకల నిర్వహణకు రూ.5 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు తెలిపారు.
ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు. ఊరించే వరాల రొట్టెను అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులు స్వర్ణాల చెరువుకు తరలి వస్తున్నారు. చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి తమ కోరికల రొట్టెలు పట్టుకుని భక్తులు భుజిస్తున్నారు. బారాషహీద్‌లకు గలేఫ్‌లు, పూల చద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.