అప్పులు, కంపెనీలు ఇచ్చే కమీషన్ల కోసమే సీఎం జగన్ మోటర్లకు, మీటర్లు బిగించి రైతుల గొంతు కోసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి.చేతనైతే విద్యుత్ నష్టాలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.మోటార్లకు మీటర్లను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు.వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిందేనని సీఎం జగన్ పంతం పట్టడం దురదృష్టకరమన్నారు సోమిరెడ్డి.శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు పెట్టడం ద్వారా 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
మోటార్లకు మీటర్లు పెట్టబోమని ప్రకటించిన పొరుగు రాష్ట్రాల సీఎంలను జగన్ చేతకాని వాళ్లని చెబుతున్నారా..? అంటూ ప్రశ్నించారు.మీటర్లు పెట్టాలని షరతు విషయంలో కేంద్ర ప్రభుత్వమే వెనకడుగు వేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోరా..? అంటూ మండిపడ్డారు.కేవలం కేంద్రం దగ్గర అప్పులు, మీటర్ల కంపెనీలు ఇచ్చే కమీషన్ల కోసం రైతుల గొంతుకోసే కుట్ర చేయడం దుర్మార్గమన్నారు.విద్యుత్ నష్టాలు తగ్గాలంటే అవసరాల మేరకు సబ్ స్టేషన్లు నిర్మించాలన్నారు.ట్రాన్స్ ఫార్మర్ల కెపాసిటీని పెంచి.. విద్యుత్ తీగలను పటిష్టం చేయాలన్నారు.
కమీషన్లకు కక్కుర్తిపడి బొగ్గు కొనుగోలులోనే రూ. వేల కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారని మండిపడ్డారు.కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టులో మట్టితో కూడిన బొగ్గును తెచ్చి రూ.700 కోట్లు నష్టం తెచ్చినా కనీసం ఏడుగురిపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదని అన్నారు.విద్యుత్ పొదుపునకు చేయాల్సినవి చేయండి కానీ మీటర్లు పెడతాం, బిల్లు ఇస్తాం.. డబ్బు కట్టండి.. అది తిరిగి చెల్లిస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు.రైతులకు సున్నా వడ్డీ రుణాల రెన్యూవల్ విషయంలోనూ మోసం చేశారని మండిపడ్డారు.