ప్రభుత్వ వసతిగృహాల్లో సౌకర్యాలు, భోజన వసతిపై విద్యార్థులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. రోడ్లపైకి రోజుల తరబడి ధర్నాలు, రాస్తారోకోలు చేసినా వారి మొర ఆలకించే వారేలేరు. చేసేదేం లేక అదే తిండి తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. కొన్నిసార్లు వారి ప్రాణాల మీదకూ వస్తోంది. అయినా వారి గోడు వినేవారే లేరు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తానాం ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో మొత్తం 102 మంది విద్యార్థులు చదువుతున్నారు. బుధవారం 95 మంది విద్యార్థులున్నారు. వీరంతా ఉదయం 8గంటలకు అల్పాహారం (ఇడ్లీ, పల్లీల చట్నీ)తిన్నారు. అరగంట తర్వాత సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. వీరిలో 51మందికి ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి రావడంతో వెంటనే వసతిగృహానికి తీసుకువచ్చారు.
ఉపాధ్యాయుల ద్వారా విషయం తెలుసుకున్న పరవాడ ఎంఈవో సునీత.. వెంటనే స్థానిక పీహెచ్‌సీ సిబ్బందికి సమాచారమిచ్చారు. పీహెచ్‌సీ వైద్యుడు రంజిత్ వైద్య సిబ్బందితో వసతిగృహానికి చేరుకొని విద్యార్థులకు చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. పల్లీల చట్నీలో బొద్దింక పడిందని.. అది తినడం వల్లే అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు చెబుతున్నారు. తహసీల్దార్ ప్రకాశ్‌రావు, సీఐ ఈశ్వర్‌రావు వసతిగృహానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.