అదేం ఖర్మమో.. తెలియదు కానీ.. చంద్రబాబు దొరికే బ్యాచ్ అంతా అలానే ఉన్నారా? అనే సందేహాలు వచ్చేలా వ్యవహరిస్తున్నారు నాయకులు. మొహం చూసి టికెట్ ఇచ్చిన నాయకుడు గెలిచి.. అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అయితే… పార్టీని పట్టించుకున్నారా? అంటే ప్రశ్నే! ఆయన ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు గోడ దూకేందుకు రెడీ అనే వార్తలు వస్తున్నాయి. ఇక, ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచి సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని పార్టీకోసం కష్టించి.. చంద్రబాబ గెలుపు కోసం అహరహం శ్రమించిన నాయకుడికి బాబు అసలు టికెట్ కూడా ఇవ్వలేదు. పోనీ.. ఈనేమన్నా.. వేరే పార్టీ వైపు మొగ్గుతున్నారా? అంటే.. ఉంటే టీడీపీనే.. ఛస్తే.. టీడీపీనే అంటున్నారు.
ఈ ఇద్దరు నాయకులు కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం గత ఏడాది ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వేగేశ్న నరేంద్ర వర్మ. ఈ క్రమంలోనే ఎన్నికలకు ఆరు మాసాల ముందు నుంచి నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అయితే, తీరా ఎన్నికల సమయానికి చంద్రబాబు.. వేగేశ్న మొహం కూడా చూడలేదు. సరికదా.. టికెట్ కూడా అన్నం సతీష్‌కు ఇచ్చేశారు.
అయినప్పటికీ.. వేగేశ్న చాలా ఓర్పుగా ఓపికగా ఎదురు చూశారు. ఇక, ఎట్టకేలకు అన్నం బీజేపీలోకి జంప్ చేయడంతో వేగేశ్నకు బాధ్యతలు ఇచ్చారు. కానీ, ముందుగానే వేగేశ్నకు టికెట్ ఇచ్చి ఉంటే ..పరిస్థితి వేరేగా ఉండేదని అంటారు ఇక్కడి తమ్ముళ్లు. ఇక, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కలువపూడి శివ.. తన మిత్రుడు రామరాజును వెంటేసుకుని బాబు దగ్గరకు వెళ్లి ఎక్కడైనా టికెట్ ఇవ్వాలని కోరారు. దీంతో శివకు నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చి రామరాజుకు ఉండి ఇచ్చారు. అక్కడ రామరాజు గెలుపు గుర్రం ఎక్కారు.
అయితే, ఆయన ఆ తర్వాత పార్టీని పట్టించుకున్నది లేదు. కనీసం సొంతగా అయినా కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా ఎక్కడా వార్తలు రావడం లేదు.పైగా వైఎస్సార్ సీపీ వైపు మొగ్గుతున్నారని, మంత్రి శ్రీరంగనాథరాజుకు టచ్‌లో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ విషయాలను పరిశీలిస్తే.. బాబు లెక్క ఎక్కడో తప్పారనే వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తుండడం గమనార్హం.