చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు TDP అభ్యర్థులుగా ఎస్వీఎస్ఎన్ వర్మ, మహమ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారైనట్లు సమాచారం. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతో పాటు భారీ మెజార్టీతో గెలిపించారు.
దీంతో వర్మకు ఎమ్మెల్సీలతో పాటు మిగిలి ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక హిందూపురంలో బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేసిన ఇక్బాల్‌కు సీటు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక అటు పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన చేసింది. పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని.. అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
జులై 1న ఉదయం ఆరు గంటల నుంచి ఇళ్ల దగ్గరకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని.. వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకు స్పష్టం చేసింది. ఇక అటు ఏపీలో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూ హక్కుపత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు. గత ప్రభుత్వంలో రీ-సర్వే పూర్తైన 4,618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కుపత్రాలను ఇప్పటివరకు పంపిణీ చేశారు.