మరికొద్ది నెలలలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆ పార్టీలోని అధ్యక్షులను మారుస్తూ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు అధిష్టానం ఉద్వాసన పలికింది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈ విషయంపై తాజాగా సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు.
సోము వీర్రాజు పై అనేక ఆరోపణలు వచ్చాయని.. ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే భావన ఉందన్నారు. అందుకే ఆయనను తప్పించి పురందేశ్వరికి ఇచ్చారని అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి పురందేశ్వరి కి ఇచ్చినా ఏపీలో బిజెపి బలం పెరగదని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దల సహకారం లేదని ఎవరైనా చెప్పగలరా..? అని ప్రశ్నించారు రామకృష్ణ.