అమరావతి: జీవో నెంబర్-1 పై హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంప దెబ్బలాంటిదన్నారు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం తెచ్చిన నిరంకుశమైన జీవో నెం 1ని హైకోర్టు కొట్టివేయడం శుభపరిణామం అన్నారు. రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజలు రోడ్లపై నిరసన తెలపకూడదంట.. పాదయాత్రలు చేయకూడదంట.. సభలు పెట్టకూడదంట.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా నిరంకుశపాలన ఏపీలో సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుకు నిదర్శనమే జగన్ రెడ్డి తెచ్చిన జీఓ నెంబర్ 1 అని మండిపడ్డారు సోమిరెడ్డి. ఈ నిరంకుశ జీవోను కొట్టేస్తూ హైకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చిందన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు నిరసన తెలపకూడదు కానీ.. సీఎం జగన్ రోడ్డు పైకి వస్తే బ్యారికేడ్లు కడతారు.. పచ్చని చెట్లు నరికేస్తారని దుయ్యబట్టారు.
కావలికి సీఎం వస్తున్నాడని మూడు రోజులుగా ఓవరాక్షన్ చేస్తున్నారని.. సభాస్థలికి కనెక్ట్ అయ్యే మూడు రోడ్లల్లో చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించి ట్రాఫిక్ ఆపేశారని మండిపడ్డారు. అంతేకాదు ఈ రోజు సీఎం వచ్చాడని కావలిలో కరెంట్ కట్ చేసేశారని.. సెల్ ఫోన్లు పని చేయకుండా టవర్లను ఆపేశారని ఆరోపించారు. సీఎం జగన్ కు ప్రజల్లోకి వచ్చే దమ్ము లేకుండా పోయిందని.. ఆయన ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు.