తిరుమలలో స్పెషల్​ దర్శనం, లడ్డూ ధరలు తగ్గాయా?.. ఇదిగో క్లారిటీ

-

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ), రూ.50 లడ్డూ ప్రసాదం ధరల మార్పుపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తులు గందరగోళానికి గురి కావొద్దని.. ఈ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది. శ్రీవారి లడ్డూ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ధరలను సవరించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.

అధిక ధరలకు ఎస్‌ఈడీ టికెట్లు పొందవచ్చని కొందరు కొన్ని వాట్సాప్‌ గ్రూపుల్లో చేస్తున్న సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించింది. వాస్తవానికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా ఇస్తుందని.. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాలకూ కొంత కోటాను కేటాయిస్తుందని తెలిపారు. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం విభాగాల ద్వారా ఈ టికెట్లను పొందొచ్చని.. రాష్ట్ర పర్యాటక వెబ్‌సైట్‌ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్లు పొందొచ్చని చెప్పింది. ఇది కాకుండా కొందరు దళారులు టూరిజం వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసి ఇస్తామని చెప్పి అమాయకుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news