కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా తరలి వస్తున్న భక్తులతో తిరుమలలో రద్దీ పెరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం పోటెత్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. సర్వదర్శనానికి కంపార్టుమెంట్లన్నీనిండి టి.బి.సి. క్యూలైన్ వరకు భక్తులు బారులు తీరినట్లు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 84,060 మంది భక్తులు దర్శించుకోగా.. 34,985 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారని పేర్కొన్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు వచ్చినట్లు వివరించారు.
మరోవైపు తిరుమలలో రేపు, ఎల్లుండి గోకులాష్టమి ఉత్సవాలు జరగనున్నాయి. మంగళవారం రోజున గోకులాష్టమి ఆస్థానం, బుధవారం రోజున ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయం బంగారువాకిలిలో రేపు రాత్రి 8 గంటలకు ఆస్థానం జరగనుంది. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు వైభవంగా ఉట్లోత్సవం నిర్వహిస్తారు. ఉట్లోత్సవంతో ఎల్లుండి ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేశారు.