కర్ణాటక – ఆంధ్రాకు జీవనాడి అయిన తుంగభద్ర డ్యాంలో ఇటీవల 19వ గేటు కొట్టుకుపోయి నీరంతా వృథాగా పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరమ్మతులపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆ గేటు స్థానంలో ఎలిమెంట్ ఏర్పాటు తొలి దశ విజయవంతమైనట్లు అధికారులు తెలిపారు. భారీ ఎలిమెంట్‌ను అమర్చేందుకు అడ్డంగా ఉన్న సెంటర్ వెయిట్‌ను తొలగించి 20 మంది కార్మికులు కలిసి క్రస్ట్‌లో తొలి ఎలిమెంటును అమర్చారు.
సుమారు 30 టన్నుల బరువుండే సెంటర్ వెయిట్‌ను క్రెయిన్ సాయంతో విజయవంతంగా కిందకు దించడంతో గేటు ఎలిమెంట్ అమర్చడానికి అడ్డంకులు తొలగిపోయాయి. కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తొలి ఎలిమెంటును శుక్రవారం సాయంత్రం విజయవంతంగా అమర్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో మరో నాలుగు ఎలిమెంట్లను ఇవాళ మధ్యాహ్నానికి అమర్చనున్నట్లు తెలిపారు. ఈ నాలుగు బిగిస్తే నీటి వృథాను పూర్తిగా అడ్డుకోవచ్చని వెల్లడించారు. మరోవైపు స్టాప్ లాగ్ గేట్ అమరిక ప్రక్రియ విజయవంతం అవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.