ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు ఎన్ని సార్లు సూచించినప్పటికీ అవేమి పట్టకుండా వ్యవహరిస్తున్నారు. అలా కొంత మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అక్కడక్కడ ప్రభుత్వం నుంచి ప్రమాద హెచ్చరికలకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేసినా వాటిని పట్టించుకోకుండా తాము చేసిందే.. రైట్ అన్నట్టు వ్యవహరిస్తుంటారు వాహనదారులు.
తాజాగా ఏపీ లోని అల్లూరి సీతారామ రాజు జిల్లా గంట్యాడ మండలం ఎగువ కొండపర్తిలో గల వైకుంఠగిరి అనంత వేంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. బొలెరో వాహనం ఒక్క సారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో శృంగవరపు కోట ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. వారిని కొత్త వలస మండలం గనిశెట్టి పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 108 వాహనంలో వస్తున్న క్షతగాత్రులలో ఓ యువకుడు మరణించినట్టు సమాచారం.