ఓవైపు ప్రపంచంలోని పలు దేశాలు మహిళల హక్కులు.. వారి స్వేచ్ఛతో పాటు.. వారిని వేధింపులకు గురి చేసే అంశాల విషయంలో మరింత కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చే ప్రయత్నం చేస్తుంటే.. అందుకు భిన్నంగా ఒక దేశంలో మాత్రం దుర్మార్గమైన చట్టం చేయటానికి సిద్ధమవుతున్నారు. ఇంతకు ఆ దేశం మరేదో కాదు ఇరాక్. ప్రస్తుతం ఆ దేశంలో అధికార పక్షం తీసుకొచ్చిన ఒక బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మాయిల పెళ్లి వయసును తొమ్మిదేళ్లకు కుదించాలంటూ సదరు బిల్లులో ప్రతిపాదించటమే దీనికి కారణం.
పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తున్నారు. ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం ఆ దేశంలో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే పర్సనల్ లా చట్టాన్ని సవరించేందుకు ఇరాక్ పార్లమెంట్ సిద్ధమవ్వడం తో హక్కుల సంఘాలు భగ్గుమంటున్నాయి. సవరణకు ఆమోదం లభిస్తే.. అమ్మాయిల పెల్లి వయస్సు 9ఏళ్లకు తగ్గిపోతుంది. విడాకులు, పిల్లల కస్టడీ, వారసత్వ ఆస్తిపై మహిళలు హక్కులు కోల్పోతారు. చైల్డ్ సెక్స్ ను చట్టబద్ధం చేయడమేనని.. స్త్రీల పరిస్థితి అత్యంత దారుణంగా మారుతుందని దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.