వైసీపీలో విజయసాయి – రోజా అస్త్రాలు రివర్స్…!

సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పార్టీపై విమర్శలు చేయడం సహజం. తమకు వీలు దొరికిన చోటల్లా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తాయి. ఇక ఏపీలో కూడా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు…జగన్‌ని టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నారు. అసలు ప్రతి విషయంలోనూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు రాజకీయం చేయడం మామూలే. కానీ అధికార పార్టీ నేతలు కూడా తాము అధికారంలో ఉన్నామనే సంగతి మరిచిపోయి, చంద్రబాబుని టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నారు. ఇంకా చంద్రబాబే అధికారంలో ఉన్నట్లు ఫీల్ అవుతూ, ఆయనపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.

రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబే కారణమని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలా ప్రతి విషయంలోనూ బాబుని టార్గెట్ చేయడం వల్ల, ఒకోసారి వైసీపీకే రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. జనం అన్నిసార్లు అధికార పార్టీ నేతల మాటలు వినడం కష్టం. పైగా అసలు పొంతన లేని విమర్శలు చేస్తే అసలు నమ్మరు. తాజాగా అంతర్వేది ఘటనలో కూడా వైసీపీ నేతలు బాబునే టార్గెట్ చేశారు. అంతర్వేది రథం దగ్ధమైన విషయంలో చంద్రబాబు ప్రమేయం ఉందని విజయసాయిరెడ్డి, రోజా లాంటి వారు మాట్లాడుతున్నారు. అసలు రథం విషయంలో మొదట పొంతనలేని సమాధానాలు ఇచ్చింది ప్రభుత్వమే.

తేనె పట్టు కోసం ఎవరో గుర్తు తెలియని వారు రథం అంటించారని మాట్లాడారు. అయితే దీనిపై హిందూ సంఘాలు, బీజేపీ, జనసేన పార్టీలు గళం విప్పడంతో, మళ్ళీ సి‌బి‌ఐ విచారణకు ఆదేశించారు. అటు టీడీపీ నేతలు సైతం సి‌బి‌ఐ విచారణే అడిగారు. అలా అని దీని వెనుక కుట్ర ఉందని మాట్లాడారు గానీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందని పెద్దగా విమర్శలు చేయలేదు. కానీ విజయసాయి-రోజాలు మాత్రం ఏదైనా చంద్రబాబు మీద తోసేయాలి అన్నట్లుగా, ఆయనే రథం తగలబెట్టించారని మాట్లాడారు.

ప్రభుత్వంలో వారి ఉన్నారు కాబట్టి విచారణ చేసి బాబు తప్పుంటే ఏమైనా చర్యలు తీసుకోవచ్చు. అలా కాకుండా వారే ప్రతిపక్షంలో ఉన్నట్లు బాబు మీద ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలని ప్రజలు సైతం అంగీకరించడం కష్టం. అధికారంలో ఉన్నామని ఏ విమర్శలు పడితే ఆ విమర్శలు చేస్తే ప్రజలు నమ్మడం కష్టం. పైగా అవి రివర్స్ అయ్యి వైసీపీకే నెగిటివ్ అవుతాయి. అధికార పార్టీ స‌రైన ఆధారాల‌తో నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌లు చేస్తే వ‌చ్చే మైలేజ్ వేరుగా ఉంటుంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

-vuyyuru subhash