పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంపై విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం అక్కడ చదువుకున్న యువతను నేడు ఉపాధి కోసం విదేశాలకు వలసపోయేలా చేస్తోంది. మెరుగైన జీవనశైలి, మరింత నాణ్యత గల ఉన్నత విద్య కోసం భారతదేశం నుంచి యువతీ యువకులు అమెరికా, ఐరోపా తదితర పారిశ్రామిక దేశాలకు వెళుతున్నారు గాని స్వదేశంలో అవకాశాలు లేకకాదు. ఉద్యోగాలు లేక కాదంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. 1971లో బంగ్లాదేశ్ అవతరణకు దారితీసిన భారత–పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాకిస్తానీయులు ఏ స్థాయిలో విదేశాలకు తరలిపోయారో ఇప్పుడు అంత కన్నా ఎక్కువ మంది ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్లిపోతున్నారన్నారు.
2022లో పాక్ నుంచి చదువుకున్న యువత 8,32,339 మంది విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి వెళ్లిపోయారు. 2021తో పోల్చితే పాక్ నుంచి చదువుకున్నవారి వలస 189 శాతం పెరిగింది. 2023 మొదటి ఐదు నెలల్లో ఇలా ఇతర దేశాల్లో ఉపాధి కోసం వలసపోయినవారి సంఖ్య 3,15,787కు చేరుకుందని వలసలు, ఇతర దేశాల్లో ఉపాధి బ్యూరో (బీఈఓఈ) వెల్లడించిందని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. పాక్ అంతర్గత సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రతిభాపాటవాలున్న విద్యావంతులైన యువకులు విదేశాలకు వలసపోవడం ఎప్పటి నుంచో సాగుతోందన్నారు.
ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో అక్కడ ఉత్పత్తి, సేవల కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయి స్థూల దేశీయ ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. మరో పక్క పాక్ మాదిరిగానే కొన్ని దశాబ్దాలు సైనిక పాలనలో మగ్గిన దక్షిణ కొరియా గత 30 ఏళ్లలో అనూహ్య పారిశ్రామిక ప్రగతి సాధించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకూ జపాన్ పాలనలో మగ్గిన దక్షిణ కొరియా దేశ విభజనతో మరింత కుంగిపోయింది. అయితే, మహాయుద్ధంలో జపాన్ ను ఓడించిన అమెరికా దక్షిణ కొరియా ప్రగతి బాధ్యత తీసుకుంది. సైనిక నియంతల పాలనలో ఉన్న ఈ ఆసియా దేశానికి అన్ని విధాలా ఈ అగ్రరాజ్యం సాయపడింది. కోట్లాది డాలర్ల ఆర్థిక సాయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం అందించిందని వివరించారు.